ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. పొంతనలేని సమాధానాలు
Mystery in pharmacy student Ghatkesar incident.ఘట్‌కేసర్ సమీపంలో ఫార్మాసీ విద్యార్థిపై అత్యాచారం కేసులో వెలుగులోకి
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2021 9:28 AM ISTఘట్‌కేసర్ సమీపంలో ఫార్మాసీ విద్యార్థిపై అత్యాచారం కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా అసలు విషయం వెల్లడైంది. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధమూ లేదని గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా అసలు ఆ విద్యార్థిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని గుర్తించారు. కాలేజీ వదిలిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఘట్‌కేసర్, యంనంపేట, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో యువతి ఒంటరిగానే సంచరించినట్టు పోలీసులు గుర్తించారు.
ఆ సమయంలో నిందితులుగా అనుమానించిన ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ సంకేతాలేవీ ఆ ప్రాంతంలో లేవు. దీంతో బాధిత యువతిని మరోసారి ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. చీకటి పడినా ఇంటికి ఇంకా ఎందుకు రాలేదంటూ తల్లి పదే పదే ఫోన్లు చేయడంతో.. ఆటో డ్రైవర్లు ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పినట్లు యువతి చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఇదిలా ఉంటే.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో బాధితురాలిని గుర్తించిన అన్నోజీగూడ పరిసరాల్లో మరోసారి గాలించగా.. అక్కడ అత్యాచారం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ విషయమై బాధితురాలిని అడగ్గా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె మానసిక స్థితిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించారు.
ఈ క్రమంలో గతంలో ఆ యువతితో సన్నితంగా మెలిగిన ఓ వ్యక్తిని విచారించగా.. మరోమారు పోలీసులను నివ్వెరపరిచే విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సదరు యువతి తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తనకు ఫోన్ చేసిందని.. తీరా తాను అక్కడి వెళ్లి చూస్తే అది నిజం కాదని తెలిసిందని.. అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టినట్లు చెప్పాడు. మరోవైపు, యువతిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు? యువతి ఆ ప్రాంతంలో ఒంటరిగా ఎందుకు సంచరించింది? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తంగా యువతి తమని తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.