కాకినాడ జిల్లాలో టీడీపీ నేతపై హత్యాయత్నం.. భవానీ మాలలో వచ్చి
Murder Attempt on TDP leader Seshagiri Rao in Tuni.టీడీపీ నేతపై హత్యాయత్నం కలకలం రేపుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 17 Nov 2022 1:04 PM ISTకాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. తునిలో నివసిస్తున్న మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శేషగిరి రావు చేతికి, తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో భవానీ మాలధారణలో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి శేషగిరి రావు ఇంటికి వచ్చాడు. బిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరి రావుపై దాడి చేయబోయాడు. అది గమనించిన శేషగిరి రావు అప్రమత్తమై తనచేతిని అడ్డుపెట్టాడు.అయినా.. అతడు శేషగిరిరావుపై దాడిని ఆపలేదు. మరోమారు దాడి చేశాడు. అనంతరం మాల ధారణలో ఉన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
శేషగిరిరావు అరుపులను విన్న కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంతలో దుండగుడు బైక్ పై పారిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే శేషగిరిరావును కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.