ప్రేమ పెళ్లి.. పరువు కాపాడుకోవాల‌ని.. న‌వ వ‌ధువు నోట్లో పురుగుల మందు పోసి..

Murder attempt on newly married couple in allagadda.తాజాగా నెల్లూరు జిల్లాలో త‌మ కుమారైను చంపైనా త‌మ ప‌రువు కాపాడుకోవాల‌నే దుర్మార్గ‌పు ఆలోచ‌న చేశారు. యువ‌తి నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య‌కు య‌త్నించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2021 4:39 AM GMT
Murder attempt on newly married couple in allagadda

ఇటీవ‌ల ప‌రువు హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. త‌మ ఇష్టానికి వ్య‌తిరేకంగా పెళ్లి చేసుకుంటున్నారు అన్న కార‌ణంతో త‌ల్లిదండ్రులు త‌మ సంతానాన్నే కాద‌నుకుంటున్నారు. వారిని హ‌త‌మార్చ‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో త‌మ కుమారైను చంపైనా త‌మ ప‌రువు కాపాడుకోవాల‌నే దుర్మార్గ‌పు ఆలోచ‌న చేశారు. యువ‌తి నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య‌కు య‌త్నించారు. ప్ర‌స్తుతం ఆయువ‌తి చావు బతుకుల మ‌ధ్య కొట్టు మిట్టాడుతోంది. బాధితురాలి క‌థ‌నం మేర‌కు.. సీతారామ‌పురం మండ‌లం సింగారెడ్డిప‌ల్లికి చెందిన పాణెం బాల‌కృష్ణ‌, దేవ‌మ్మ చెరువుకు చెందిన మోడి అనిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇంట్లోవారికి తెలియ‌కుండా ఈ నెల 5న క‌ర్నూలు జిల్లా అహోబిలం దివ్య‌క్షేత్రంలో పెళ్లి చేసుకున్నారు. త‌మ కుమారై క‌నిపించ‌డం లేద‌ని అనిత త‌ల్లిదండ్రులు వ‌రుడి కుటుంబ స‌భ్యుల‌పై కిడ్నాప్ కేసు పెట్టారు. విష‌యం తెలుసుకున్న ప్రేమ‌జంట పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి తాము మేజ‌ర్ల‌మ‌ని, ఇష్ట‌పూర్వ‌కంగానే పెళ్లి చేసుకున్న‌ట్లు పోలీసుల‌కు చెప్పారు. మంగ‌ళ‌వారం ఇరువ‌ర్గాల పెద్ద‌ల‌ను పిలిపించి త‌హ‌సీల్దారు వెంక‌ట సునీల్ వ‌ద్ద హాజ‌రుప‌రిచారు. ఇద్దరూ మేజర్లు కావడం.. తన భర్తతో వెళతానని అనిత చెప్పడంతో వారిని బాలకృష్ణ ఇంటికి పంపించారు.

వారు ఆటోలో ఇంటికి బ‌య‌లుదేర‌గా.. యువ‌తి కుటుంబ స‌భ్యులు, బంధువులు కారులో వారిని వెంబ‌డించారు. సంగాసానిప‌ల్లి స‌మీపంలో ఆటోను అడ్డ‌గించారు. దంప‌తుల‌పై దాడి చేసి యువ‌తి నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య‌కు య‌త్నించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని దంప‌తుల‌ను ఉద‌య‌గిరి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయగిరి సీఐ ప్రభాకర్‌రావు ఆస్ప‌త్రిలో అనిత తో మాట్లాడి వివ‌రాలు సేక‌రించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it