ఔటర్‌ రింగ్‌రోడ్డు పై ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల దుర్మ‌ర‌ణం

MPTC Couple Died in Road Accident.హైదరాబాద్‌ మహానగర శివారులోని ఔటర్‌ రింగ్‌రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2021 9:48 AM IST
ఔటర్‌ రింగ్‌రోడ్డు పై ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల దుర్మ‌ర‌ణం

హైదరాబాద్‌ నగర శివారులోని ఔటర్‌ రింగ్‌రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఎంపీటీసీ దంపతులు మృతి చెందారు. అంబ‌ర్‌పేట్ ఔట‌ర్ రింగ్‌రోడ్డు వ‌ద్ద ప్రమాదం జరిగింది. వివ‌రాల్లోకి వెళితే.. న‌ల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్‌పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం కవిత తన భర్తతో వేణుగోపాల్‌ రెడ్డితో కలిసి స్కార్పియో వాహ‌నంలో హైద‌రాబాద్ వెలుతోంది. పెద్ద అంబ‌ర్‌పేట వ‌ద్ద రాగానే.. యూ ట‌ర్న్ వ‌ద్ద ముందు వెలుతున్న టిప్ప‌ర్ డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశాడు. ఈ క్ర‌మంలో వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం.. టిప్ప‌ర్‌ను వెనుక వైపు నుంచి బ‌లంగా ఢీ కొట్టింది.

కారుముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఎంపీటీసీ క‌విత‌, ఆమె భ‌ర్త వేణుగోపాల్ రెడ్డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కారులోంచి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. టిప్ప‌ర్ డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్నాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. ఆగ‌స్టు 22నే వీరి కుమారై వివాహం జ‌రిపించారు. ఇంత‌లోనే వీరు మృతిచెంద‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. స్వ‌గ్రామ‌మైన అనిశెట్టి దుప్పలపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story