దళితుడిని పెళ్లి చేసుకుందని.. కూతురికి గుండు గీయించిన తండ్రి
MP woman forced to undergo 'purification' for marrying Dalit.కొత్త కొత్త టెక్నాలజీలతో ప్రపంచమంతా అభివృద్ది
By తోట వంశీ కుమార్ Published on 31 Oct 2021 7:00 PM ISTకొత్త కొత్త టెక్నాలజీలతో ప్రపంచమంతా అభివృద్ది బాటలో పయనిస్తోంది. అయినప్పటికి కొందరు మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలను వీడడం లేదు. ఇంకా ఈ సమాజంలో పరువు హత్యలు, కులం పేరుతో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి.. తన కుమారై ఓ దళితుడిని ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఆమెకు గుండు గీయించి.. పుణ్యస్నానం చేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్ హాస్టల్ లో ఉంటూ నర్సింగ్ చదువుతోంది. కళాశాలలో తనతో పాటు చదివే అమిత్ అహిర్వాల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ గతేడాది మార్చి 11న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కాగా.. ఈ ఏడాది జనవరిలో సాక్షీ విషయాన్ని ఇంట్లో చెప్పింది. కుమారై ప్రేమ వివాహం తెలిసి ఆ తండ్రి ఆగ్రహాంతో రగిలిపోయాడు.
జనవరి 10న తన కుమారై తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అసలు విషయం తెలిసింది. ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడారు.పెళ్లికి యువతి తండ్రి ఒప్పుకోవడంతో.. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సాక్షీ నర్సింగ్ పూర్తి చేసేందుకు ఫిబ్రవరిలో హాస్టల్‌కు వెళ్లింది. ఆగస్టు 18న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమెను తీసుకువచ్చేందుకు యువతి తండ్రి హాస్టల్‌కు వెళ్లాడు.
ఇంటికి తీసుకువెలుతున్నట్లు అక్కడి వారి చెప్పి.. యువతిని హోషంగాబాద్‌లోని నర్మదా నది వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమెకు గుండు కొట్టించాడు. పుణ్యం స్నానం చేయించాడు. దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె వేసుకున్న దుస్తులను బలవంతంగా నదిలో పడవేయించాడు. అంతటితో ఆగకుండా భర్తకు విడాకులు ఇవ్వాలని వేదింపులకు గురి చేశాడు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న సాక్షీ.. భర్త వద్దకు చేరుకుంది. భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.