ఏప్రిల్ 8 న కొట్టాయంలో ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన ప్రమాదంలో రాజ్యసభ ఎంపీ, కేరళ కాంగ్రెస్ నాయకుడు జోస్ కె మణి కుమారుడు అరెస్ట్ అయ్యాడు. 19 ఏళ్ల యువకుడు రాష్ డ్రైవింగ్ చేశాడనే ఆరోపణలపై సోమవారం అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. K M మణి జూనియర్ (19) మణిమాల సమీపంలో మువాట్టుపుజా-పునలూర్ రాష్ట్ర రహదారిపై MUV నడుపుతుండగా ద్విచక్ర వాహనానికి యాక్సిడెంట్ అయింది. ద్విచక్ర వాహనంపై ఉన్న మాథ్యూ జాన్ అలియాస్ జిస్ (35), అతని తమ్ముడు జిన్స్ జాన్ (30) గాయపడి కొట్టాయంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
వేగంగా నడుపుతున్న ఎంయూవీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడం వల్లే ద్విచక్ర వాహనానికి ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. దీంతో మణి జూనియర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 A (నిర్లక్ష్యం వల్ల మరణం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యోహన్నన్, సిసమ్మ దంపతులకు మాథ్యూ, జిన్స్ సంతానం. మాథ్యూకు వివాహం కాగా, జిన్స్ కు ఇంకా పెళ్లి అవ్వలేదు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే రోజు ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.