మానసికస్థితి సరిగాలేని కుమారుడు.. బావిలోకి తోసి చంపేసిన తల్లి
Mother throws her son in to the well.మానసిక రోగి అయిన కుమారుడికి పద్నాలుగేళ్లు సపర్యలు చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 23 Jun 2021 2:30 AM GMTమానసిక రోగి అయిన కుమారుడికి పద్నాలుగేళ్లు సపర్యలు చేసింది. వయసు, శరీరం పెరుగుతున్నా అతడి మానసిక స్థితిలో ఎలాంటి మార్పూ లేదు. అతడికి వైద్యం చేయించే స్తోమత లేక, అతడి విపరీత ప్రవర్తన భరించలేక.. బతికుండగానే కొడకును బావిలోకి తోసి చంపేసింది. ఈఘటన పెద్దపల్లిలో సోమవారం సాయంత్రం జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి మొగల్‌పుర ప్రాంతంలో శేఖర్, శ్యామలయ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమారై సంతానం. అయితే.. చిన్న కుమారుడు యశ్వంత్(16)కు మానసికస్థితి సరిగ్గా లేదు. శేఖర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. శ్యామల ఇంట్లోనే ఉంటూ యశ్వంత్ బాగోగులు చూసుకుంటోంది. యశ్వంత్ కు ప్రతి నెల రూ.5వేల విలువైన మందులు వాడాల్సి వస్తోంది. మందులు వాడినప్పుడు మాత్రమే యశ్వంత్ బాగుంటున్నాడు.
మందులు లేకపోతే అతని ప్రవర్తనలో మార్పు వస్తోంది. శేఖర్‌కు తగిన స్థోమత లేకపోవడంతో డబ్బులు ఉన్నపుడే మందులు తెచ్చి వాడేవారు. శేఖర్‌కు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవడం లేదు. ఓ వైపు ఎదిగిన కూతురికి వివాహం చేయాలనే ఆలోచన. మరోవైపు కుమారుడి మానసిక స్థితి ఆతల్లికి మనశాంతి లేకుండా చేశాయి. కొద్ది రోజులుగా మందులు వాడకపోవడంతో యశ్వంత్ మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆడవారిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇరుగుపొరుగు వారి ముందు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో శ్యామల తీవ్ర మానసిక వేదనకు లోనైంది.
సోమవారం సాయంత్రం కట్టెలు తీసుకురావడానికి కుమారుడిని వెంటబెట్టుకుని స్థానిక కళాశాల వెనుకబాగంలోని పంట చేనులోకి వెళ్లింది. కొద్దిసేపు తరువాత యశ్వంత్‌ను ఒక్కసారిగా బావిలోకి తోసేసింది. ఈతరాని యశ్వంత్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఇంటికి వచ్చిన శ్యామల భర్తకు విషయాన్ని వివరించింది. మంగళవారం ఉదయం యశ్వంత్ మృతదేహం బావిలో తేలడంతో శేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి శ్యామలను అరెస్టు చేశారు.