యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఓ ఇల్లాలు.. తన ముగ్గురు పిల్లలకు ఉరి వేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌లోని రాంనగర్‌లో వెంకటేష్, ఉమా రాణి(31) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. వెంకటేష్ మద్యానికి బానిస అయ్యాడు. కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు.
దీంతో రాణి పిల్లల ఆలనాపాలనా చూసుకునేది. ఇటీవల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. భర్త మద్యానికి బానిస అవ్వడంతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో రాణి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో దారుణ నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతే.. భర్త పిల్లలను పట్టించుకోడని తలచి.. చిన్నారులకు కూడా ఉరి వేసింది. అయితే.. చిన్న కుమారైకు చీరతో బిగించిన ఉరి జారీపోవడంతో బతికింది. తల్లి ఉమారాణితో పాటు ఇద్దరు కుమారైలు హర్షిణి(13), లక్కీ(11) మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.