ఎంత పని చేశావమ్మా..
Mother commits suicide with her childrens.ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
By తోట వంశీ కుమార్
ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మహిళ.. తన ఇద్దరు పిలలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఓ శ్మశానవాటిక కు వెళ్లి శానిటైజర్‌ను తనతో పాటు తన బిడ్డలపైనా పోసింది. అనంతరం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఈ ఘటనలో ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని నవాబుపేట యనమలపాళేనికి చెందిన ఆదినారాయణ తన కుమార్తె వెంకటసుబ్బులు(27)ను తన అక్క కుమారుడైన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పేర్లపేట గ్రామానికి చెందిన కొండ్రెడ్డి బాబుకి ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి మహేష్ బాబు (7), మధురవాణి (5) సంతానం.
వీరు కర్ణాటక రాష్ట్రం బళ్లారికి వలసవెళ్లారు. అక్కడ పదెకరాల్లో రూ.20లక్షలు పెట్టుబడి పెట్టి అంజూర సాగు చేశారు. పంట బాగానే పండిందనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వీరి ఆశలను దెబ్బ తీసింది. అంజూరను అమ్ముకునే అవకాశాలు లేక పెట్టుబడి దక్కక ఆర్థికంగా చితికిపోయారు. తీవ్ర వేదనకు గురైన సుబ్బులు తన ఇద్దరు పిల్లలను తీసుకుని నెల్లూరులోని పుట్టింటికి బయలు దేరింది. శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాళెం దగ్గర బస్సు దిగారు. సెంటర్‌లో టీ తాగి.. అనంతరం వింజమూరు మార్గంలో ఉన్న శ్మశానవాటికలోకి వెళ్లి పిల్లలతో పాటు తన ఒంటిపై శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది.
వెంకటసుబ్బులు, మధురవాణి మంటల్లో కాలి మృతిచెందగా.. తప్పించుకున్న మహేష్ ఈ విషయాన్ని నెల్లూరు పాళెం వాసులకు చెప్పాడు. వారు వెంటనే అతడి తండ్రితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుప్రతికి తరలించి దర్యాప్తు చేపట్టారు.