గత ఏడాదిన్నర కాలంగా తప్పించుకుంటున్న పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా, నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా నిర్వహించిన దాడుల్లో లంకమల్ల అటవీ ప్రాంతంలో నిందితుడు పట్టుబడ్డాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
నాగదస్తగిరితో పాటు, మరో ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జైలులో ఉన్న లాలా బాషా, ఫక్రుద్దీన్ నాయకత్వంలో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. నాగదస్తగిరిపై 86 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, 34 దొంగతనం కేసులు, మూడు పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి. అతని భార్య లాలూబీని కూడా వారం క్రితం అరెస్టు చేశారు.