'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్రా విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ సరసన కలర్స్ స్వాతి నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
"నేను నీకో విషయం చెబుతున్నా.. కళ్లు మూసుకో.. ఐ లవ్ యూ మధు " అంటూ స్వాతి చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. "20 ఏళ్ల బాధ.. ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం కూడా లేదు". "20 ఏళ్ల క్రితం నెత్తినోరు బాదుకున్నా వినకుండా ఆ మధుగాడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలంటూ రోడ్డు ఎక్కావు. సరైన కారణాలు కూడా చెప్పడం లేదు "వంటి డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
దంపతుల మధ్య క్షణికావేశంలో వచ్చే చిన్న తగాదాలు, దాని వల్ల వారిద్దరి జీవితాల్లో ఏర్పడే కలతల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా టీజర్‌ను బట్టి అర్థం అవుతోంది. అచు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.