చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి.. పీలేరు - కల్లూరు మార్గంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం కళాశాల ముగిసిన అనంతరం కారులో పులిచెర్ల మండలం కోడిది పల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు. అక్కడ కారు దిగి నాకు తినడానికి ఏమైనా తీసుకురమ్మని డ్రైవర్ ను పంపించారు.
అదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్ వెళ్లే ప్యాసింజర్ రైలు వస్తుండడంతో సిబ్బంది గేటు వేశారు. కారు దిగి ట్రాక్ పక్క నుంచి పీలేరు దిశగా నడవడం మొదలుపెట్టారు. సరిగ్గా రైలు వచ్చే సమయానికి పట్టాలపైకి దూసుకురావడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొని సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. రైలు ఢీ కొట్టడంతో.. ఆయన శరీర భాగాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రమణారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.