మాన‌వ‌బాంబుగా మారి భార్య‌ను చంపిన భ‌ర్త‌

Mizoram man kills estranged wife in suicide bomb attack.మ‌లి వ‌య‌స్సులో ఉన్న వృద్దదంప‌తులు హాయిగా కాలం గ‌డుపుతారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 7:25 AM GMT
మాన‌వ‌బాంబుగా మారి భార్య‌ను చంపిన భ‌ర్త‌

మ‌లి వ‌య‌స్సులో ఉన్న వృద్దదంప‌తులు హాయిగా కాలం గ‌డుపుతారు. అయితే.. ఆ భ‌ర్త‌.. భార్య‌పై క‌క్ష్య పెంచుకున్నాడు. మాన‌వ‌బాంబుగా మారి భార్య ప్రాణాలు హ‌రించాడు. ఈ ప్ర‌య‌త్నంలో అత‌డు కూడా మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న మిజోరంలోని లుంగ్‌లేయి జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. లుంగ్‌లేయీ ప‌ట్ట‌ణంలో రోహ్మింగ్లియానా (62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరు కూర‌గాయాల విక్ర‌యిస్తూ జీవించేవారు. ఏ ప‌ని చేయ‌కుండా రోహ్మింగ్లియానా త‌ర‌చూ భార్య ట్లాంగ్థియాన్‌ఘ్లిమిని వేదించేవాడు. ఈ క్ర‌మంలో ఆ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. దీంతో భార్య ట్లాంగ్థియాన్‌ఘ్లిమిని అంతమొందించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం స్థానిక చ‌న్మ‌రి ప్రాంతంలో ర‌ద్దీగా ఉండే మార్కెట్‌లో ట్లాంగ్థియాన్‌ఘ్లిమి కూర‌గాయ‌లు విక్ర‌యిస్తుండ‌గా అక్క‌డకు వ‌చ్చాడు. ఆమెతో ఏదో మాట్లాడుతూ.. కౌగిలించుకున్నాడు.

దుస్తుల లోప‌ల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకుని వ‌చ్చిన అత‌డు ట్రిగ్గ‌ర్ నొక్క‌గానే భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. చికిత్స పొందుతూ వారు బుధ‌వారం మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌నలో మ‌రెవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. కాగా.. పేలుడు జ‌రిగిన స‌మ‌యంలో ట్లాంగ్థియాన్‌ఘ్లిమి కుమార్తె తల్లికి కొద్దిదూరంలోనే ఉంది.

Next Story
Share it