దారుణం.. 9 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపిన 13 ఏళ్ల బాలుడు.. పగతో రగిలిపోయి..
బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఒక పిన్న వయస్కురాలు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By - అంజి |
దారుణం.. 9 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపిన 13 ఏళ్ల బాలుడు.. పగతో రగిలిపోయి..
బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఒక పిన్న వయస్కురాలు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం 13 ఏళ్ల బాలుడు పగతో ఈ దారుణానికి ఒడిగట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కోలాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సందల్‌పూర్ గ్రామానికి చెందిన ఒక తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలించగా.. మరుసటి రోజు ఉదయం సమీపంలోని ఒక మొక్కజొన్న చేనులో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది.
బాలిక గొంతును పదునైన ఆయుధంతో కోసి అత్యంత క్రూరంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు. ఈ బాలుడు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ బాలుడి ప్రవర్తన సరిగ్గా లేదని, అతను మత్తు పదార్థాలు వాడుతున్నాడని సదరు బాలిక ఇటీవల అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు బాలుడిని తీవ్రంగా మందలించారు. తనపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు, ఆమె పొలం వైపు వెళ్తున్న సమయంలో పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ పోలీస్ అధికారి రంజన్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మైనర్ కావడంతో అతనిపై జువైనల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే మత్తుకు బానిస కావడం వల్లే బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో సందల్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.