పక్కా పథకం ప్రకారం దొంగలు రైలును ఆపి దోపిడికి పాల్పడ్డారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెలుతున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి సిగ్నల్ తీగలను అప్పటికే దుండగలు కత్తిరించారు.
సిగ్నల్ లేకపోవడంతో రైలు తురకపల్లి రైల్వే స్టేషన్ ఔటర్‌లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే దొంగలు భోగీల్లోకి చొరబడి మారణాయుధాలు చూపించి ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకున్నారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణీస్తున్న మహిళలల మెడల్లోంచి బంగారు నగలను దోచుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మొత్తంలో దోపిడి జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. తొమ్మిది తులాల బంగారం, నగలు, నగదు దుండగులు దోచుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ సెవెన్ హిల్స్ రైలుకు సిగ్నల్ ఇచ్చి రైలు పంపారు.