ప్రియురాలిపై అత్యాచారం, హత్య.. ఆత్మ కోసం క్షుద్రపూజలు చేసిన ప్రియుడు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక భయంకరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదంతో...
By - అంజి |
ప్రియురాలిపై అత్యాచారం, హత్య.. ఆత్మ కోసం క్షుద్రపూజలు చేసిన ప్రియుడు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక భయంకరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదంతో ఒక ఎంబీఏ విద్యార్థినిని ఆమె ప్రియుడే గొంతు నులిమి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు కూడా చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇండోర్‌లోని ద్వారకాపురి ప్రాంతంలో ఉన్న ఒక అద్దె ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జనవరి 13న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, 24 ఏళ్ల యువతి మృతదేహం మంచంపై వివస్త్రగా పడి ఉంది.
ఆమె మెడపై తాడు గుర్తులు ఉండటంతో గొంతు నులిమి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ మృతదేహం కొన్ని రోజుల పాతదిగా గుర్తించారు. బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 11న తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా, ఆమె ప్రియుడు పియూష్ ధమ్నోడియాతో కలిసి ఉన్నట్లు తెలిసింది. నిందితుడు ముంబైలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పియూష్, బాధితురాలు సహవిద్యార్థులు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
అయితే పెళ్లి విషయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజున అద్దె గదిలో కలుసుకున్న వీరిద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత మళ్లీ పెళ్లిపై గొడవ పడ్డారు. ఆగ్రహంతో పియూష్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్ గదిలో ఉంటూ, చనిపోయిన తన ప్రియురాలి ఆత్మను తిరిగి పిలిచేందుకు తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఫోన్‌ను ధ్వంసం చేసి ముంబైకి పారిపోయాడు. మరోవైపు బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.
తన కుమార్తెకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు, వీడియోలను నిందితుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టేవాడని, తన కాలేజీ ఫీజులు కట్టాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆయన తెలిపారు. ఆ ఒత్తిడి వల్లే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా రికార్డుల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.