కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో పాటు ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల్లో ఉన్న గుడిసెలు దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే.. ఆ హోటల్‌ను గత మూడు రోజులుగా మూసే ఉంచడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను చుట్టుపక్కల ఉన్న హోటల్స్, షాప్‌లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే.. హోటల్ లో 16సిలిండర్లు ఉండడంతో పోలీసులు ఆ హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో నంద్యాల-నందికొట్టూరు రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.