వరకట్నదాహానికి నవ వధువు బలి
Married woman suicide in Hindupuram.ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. అడుగడుగునా ఆ యువతికి కష్టాలే
By తోట వంశీ కుమార్ Published on 10 Oct 2021 6:00 AM GMTఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. అడుగడుగునా ఆ యువతికి కష్టాలే ఎదురయ్యాయి. అదనపు కట్నం కావాలంటూ భర్త నిత్యం వేదించడంతో పెళ్లైన నెలకే ఆ నవ వధువు దారుణ నిర్ణయం తీసుకుంది. తన బాధను ఎవరికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న వెంకటేశులు, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె పల్లవి (28) బీఈడీ చేసి గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఆగస్టు 27న పామిడిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునతో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.లక్ష నగదు, మరో లక్ష రూపాయల బంగారం ఇచ్చారు. అయితే.. వివాహం అయిన కొద్ది రోజులకే పల్లవికి అత్తగారింట్లో అదనపు కట్నం తీసుకురావాలంటూ వేదింపులు మొదలయ్యాయి. నిత్యం వేదింపులు ఎక్కువ కావడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.
అయినప్పటికి మల్లికార్జున్ ప్రతి రోజు పల్లవికి ఫోన్ చేసి కట్నం తీసుకురావాలని మానసికంగా వేదింపులకు గురిచేసేవాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు లోనైన పల్లవి.. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తమామల వేదింపుల కారణంగానే తమ కుమారై ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.