ప్రేమ వివాహం చేసుకున్న యువ‌తి.. భ‌ర్త వ‌రుస‌కు సోద‌రుడు అవుతాడ‌ని తెలిసి

Married woman suicide in Bhadradri Kothagudem District.ఆ యువ‌కుడు త‌న ఇంటి మార్చి చెప్పి ప్రేమ వివాహం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2021 9:48 AM GMT
ప్రేమ వివాహం చేసుకున్న యువ‌తి.. భ‌ర్త వ‌రుస‌కు సోద‌రుడు అవుతాడ‌ని తెలిసి

ఓ యువ‌కుడు త‌న ఇంటి మార్చి చెప్పడంతో యువ‌తి.. అత‌డిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తరువాత ఎవ‌రి ఇంటికి వారు వ‌చ్చి ఉంటున్నారు. వారిద్ద‌రి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. బంధువులు వారిద్ద‌రూ వ‌రుస‌కు అన్నా చెల్లెళ్లు అవుతార‌ని చెప్పారు. దీంతో మ‌న‌స్థాపం చెందిన యువ‌తి పురుగ‌ల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. విష‌యం తెలిసిన ఆ యువ‌కుడు కూడా ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. నెహ్రూనగర్‌ తండాకు చెందిన బోడ శ్వేత(21), క‌ట్టుగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ వెంక‌టేశ్‌(24) ఏర్పడిన ప‌రిచ‌యం ప్రేమగా మారింది. తన ఇంటి పేరు భూక్యా అని శ్వేతకు చెప్పి, తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్‌ చేశాడు. ప‌ది రోజుల‌ క్రితం పెద్ద‌ల‌కు తెలియకుండా ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌రువాత ఎవ‌రి ఇంట్లో వారు ఉంటున్నారు. కాగా.. వీరి పెళ్లిఫోటోలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బంధువులు చూశారు. వీరిద్ద‌రూ దూర‌పు బంధువులు అవుతార‌ని.. వరుస‌కు అన్నా, చెల్లి అవుతార‌ని చెప్పారు. విష‌యం తెలిసిన శ్వేత తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది.

మంగ‌ళ‌వారం పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ విష‌యం తెలుసుకున్న వెంక‌టేశ్ కూడా పురుగుల మందుతాగి.. వ్య‌వ‌సాయ బావిలో దూకాడు. గ‌మ‌నించిన స్థానికులు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పరిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. త‌మ బిడ్డను మోసం చేసి పెళ్లి చేసుకుని ఆత్మ‌హ‌త్య‌ చేసుకునేలా చేశాడని.. యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Next Story
Share it