దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్.. వీడియో వైర‌ల్‌

Mangaluru Cop Dodges Traffic In Dramatic Chase To Catch Mobile Thief.సాధార‌ణంగా సినిమాల్లో దొంగ‌ల‌ను ఛేజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jan 2022 12:25 PM IST
దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్.. వీడియో వైర‌ల్‌

సాధార‌ణంగా సినిమాల్లో దొంగ‌ల‌ను ఛేజ్ చేసి మ‌రీ పోలీసులు ప‌ట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. అయితే.. నిజ జీవితంలో అలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా మంగ‌ళూరు న‌గ‌రంలో ఓ ఏఆర్ఎస్ఐ సినిమా స్టైల్‌లో దొంగ‌ను వెంటాడి ప‌ట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దొంగ‌ను ఎస్ఐ వెంబడించ‌డం చూసిన ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు.

అసిస్టెంట్ రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్ (ఏఆర్‌ఎస్‌ఐ) వరుణ్ అల్వా.. నీర్‌మార్గ్‌కు చెందిన 32 ఏళ్ల హరీష్ పూజారి అనే దొంగను వెంబ‌డించి సినిమా స్టైల్‌లో పెడ‌రెక్క‌లు విరిచి ప‌ట్టుకోవ‌డం ఆ వీడియోలో క‌నిపించింది. దొంగ ఇరుకైనా గ‌ల్లీల గుండా ప‌రిగెడుతుండ‌గా..ఆ వెన‌కే ఏఆర్‌ఎస్‌ఐ ప‌రుగులు పెట్టాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో చిన్న చిన్న అవాంత‌రాలు ఎదురైతే.. వాటిపై నుంచి దూకుతూ ముందుకు సాగాడు. చివ‌రకు ర‌ద్దీగా ఉండే ర‌హ‌దారి మ‌ధ్య‌లో పోలీసు ఆ దొంగ‌ను ప‌ట్టుకోవ‌డం ఆ వీడియోలో చూడొచ్చు.

అంత‌కముందు నెహ్రూ మైదాన్ స‌మీపంలో ఓ వ్య‌క్తి మ‌రో వ్య‌క్తిని వెంబ‌డించ‌డాన్ని పోలీసులు గ‌మ‌నించారు. రాజ‌స్థాన్‌కు చెందిన గ్రానైట్ కార్మికుడు ప్రేమ్ నారాయ‌ణ్ యోగి అనే వ్య‌క్తి నుంచి ముగ్గురు వ్య‌క్తులు సెల్‌ఫోన్ లాక్కెళ్లిన‌ట్లు గుర్తించారు. అత్తావర్‌కు చెందిన 20 ఏళ్ల శమంత్, హరీష్ పూజారి పోలీసుల అదుపులో ఉండగా రాజేష్ తప్పించుకోగలిగాడు. దీనిపై పాండేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.డిపార్ట్‌మెంట్ ఏఆర్‌ఎస్‌ఐ వరుణ్ అల్వాకు రూ.10,000 నగదు రివార్డును మంగళూరు పోలీసు కమిషనర్ ఎన్ శశి ప్ర‌క‌టించారు.

Next Story