అత్త ప్రవర్తనతో మనస్తాపం చెందిన అల్లుడు ఆత్మహత్య
Manasthapamtho Yuvakudu Athmahatya.తనను దూషిస్తున్నారని మనస్థాపం చెందిన అల్లుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By తోట వంశీ కుమార్
ఎనిమిది నెలల క్రితం అతడికి వివాహామైంది. అయితే.. అత్త(భార్య తల్లి) కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్త మరొకరితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. వారిద్దరు తనను దూషిస్తున్నారని మనస్థాపం చెందిన అల్లుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బాలాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తుటిపేట తండాకు చెందిన అంగోతు రాము పెద్ద కుమారుడు బాబు(25)కు చందంపేట మండలం తెల్దార్‌పల్లి ప్రాంతానికి చెందిన యువతితో 8 నెలల క్రితం వివాహమైంది.
రాము క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ.. భార్యతో కలిసి కర్మన్‌ఘాట్ నందనవనం శ్రీరమణ కాలనీలో నివాసం ఉంటున్నాడు. దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయని బాబు తండ్రి రాములు ప్రశ్నించాడు. తన అత్త మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని.. వారిద్దరు తనను దూషిస్తున్నారని చెప్పాడు. దీంతో ఆయన పెద్ద మనషుల సమక్షంలో పంచాయతీ పెట్టి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిద్దరి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఈ క్రమంలో బాబు భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
అత్తతో సన్నిహితంగా ఉండే వ్యక్తి బాబుకు ఫోన్ చేసి బెదిరించాడు. మంగళవారం ఉదయం బాబు తమ్ముడు బబ్బర్ బయటకు వెళ్లి.. మధ్యాహ్నాం తిరిగి వచ్చి చూడగా.. తలుపుకు గడియ పెట్టి ఉంది. జబ్బర్, అతని చెల్లెలు, ఇంటి యజమాని బలవంతంగా తలుపు తెరిచి చూడగా.. బాబు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి అత్తతో పాటు ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి బెదిరింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాబు తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.