నా శవాన్నీ మా నాన్న తాకొద్దంటూ కొడుకు సూసైడ్ నోట్
Man Suicide in Bhadradri Kothagudem.కొడుకు కాపురాన్ని సరిదిద్దాలని అనుకున్నాడు ఆ తండ్రి. . కానీ నా శవాన్నీ మా నాన్న తాకొద్దంటూ కొడుకు సూసైడ్ నోట్.
By తోట వంశీ కుమార్ Published on 9 Jan 2021 1:16 PM ISTకొడుకు కాపురాన్ని సరిదిద్దాలని అనుకున్నాడు ఆ తండ్రి. కోడలితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల సాయం కోరాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని ఆ కొడుకు.. తన తండ్రే తనకు వ్యతిరేకంగా ఉన్నాడని భావించి మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్(24)కు సత్తుపల్లికి చెందిన రామకృష్ణవేణితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారై ఉంది.
వివాహాం జరిగిన ఏడాదికే భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. కృష్ణవేణి తన బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. డిసెంబర్ 14న అత్త బుల్లెమ్మ(పవన్ తల్లి) మరణించడంతో.. అంత్యక్రియలకు, కర్మకాండలకు హాజరైంది. జరిగిన గొడవలు మరిచిపోయి కలిసి ఉందామని భర్తకు నచ్చజెప్పింది. అయితే.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. దీంతో మామ శ్రీను(పవన్ తండ్రి)తో కలిసి పోలీసులను ఆశ్రయించింది. మీరైనా నచ్చజెప్పి తన కాపురాన్ని నిలబెట్టాలని కోరింది. తన తండ్రి తనకు వ్యతిరేకంగా భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేని కళ్యాణ్ గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతను రాసిన సూసైడ్ నోట్‌లో.. "నా శవాన్ని మానాన్న, నా భార్య ముట్టుకోవడానికి వీల్లేదు. నాన్నమ్మ, తాతయ్యలే అంత్యక్రియలు, కర్మ, క్రతువులు జరిపించాలని" రాశాడు. కుమారుడి చివరి కోరిక మేరకు అతడి దహన సంస్కారాలకు అతడి తండ్రి దూరంగా ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.