పుట్టింటికి వెళ్లిన భార్య‌ల‌ను ర‌ప్పించాలనుకున్నారు.. క‌ట్ చేస్తే..

Man Suicide attempt in Rangareddy.వారిద్ద‌రూ మంచి స్నేహితులు. క‌లిసిమెలిసి ఉండేవారు. అయితే.. కొన్ని కార‌ణ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2021 3:18 PM IST
పుట్టింటికి వెళ్లిన భార్య‌ల‌ను ర‌ప్పించాలనుకున్నారు.. క‌ట్ చేస్తే..

వారిద్ద‌రూ మంచి స్నేహితులు. క‌లిసిమెలిసి ఉండేవారు. అయితే.. కొన్ని కార‌ణ‌ల వ‌ల్ల వారి భార్య‌లు పుట్టింటికి వెళ్లారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రు పూటుగా మ‌ద్యం తాగారు. ఎలాగైనా భార్య‌లను త్వ‌ర‌గా ర‌ప్పించేందుకు వారిని బెదిరించాల‌ని.. ఉరి వేసుకున్న‌ట్లు వీడియో తీసి పంపించాల‌ని ఫ్లాన్ చేశారు. ప్లాన్ బెడిసి కొట్ట‌డంతో.. ఒక‌రు ఆస్ప‌త్రి పాలు కాగా.. మ‌రొక‌రు జైలు పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా నందిగామ మండ‌లంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. నందిగామ మండ‌లం అప్పారెడ్డిగూడ‌లో శ్రీను, జ‌గ‌న్ నివ‌సిస్తున్నారు. వారిద్ద‌రు మంచి స్నేహితులు. జ‌గ‌న్ భార్య ఆరు నెల‌ల క్రితం పుట్టింటికి వెళ్ల‌గా.. శ్రీను భార్య అనారోగ్యం కార‌ణంతో ఇటీవ‌ల అమ్మ‌గారింటికి వెళ్లింది. ఈ క్ర‌మంలో ఈ నెల 26న‌(బుధ‌వారం) ఇద్ద‌రూ క‌లిసి మ‌ద్యం తాగారు. త‌మ భార్య‌ల‌ను త్వ‌ర‌గా త‌మ ఇంటికి ర‌ప్పించాల‌ని ఫ్లాన్ చేశారు. తాము ఉరి వేసుకున్న‌ట్లు వీడియో తీసి వారికి పంపించాల‌నుకున్నారు.

తొలుత‌ జ‌గ‌న్ చెట్టుకు ఉరివేసుకున్న‌ట్లు న‌టించ‌గా.. శ్రీను వీడియో తీశాడు. మందు మ‌త్తులో ఉండ‌డంతో మెడ‌కు తాడు బిగుసుకోవ‌డంతో జ‌గ‌న్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. తేరుకున్న శ్రీను వెంట‌నే మ‌రొ వ్య‌క్తి సాయంతో.. జ‌గ‌న్ మెడ‌కు ఉన్న తాడును విప్పి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జ‌గ‌న్ కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. అయితే.. ఆస్ప‌త్రి బిల్లు క‌ట్టే విష‌య‌మై గ్రామంలో పంచాయ‌తీ జ‌రిగింది. వీడియోలో జ‌గ‌న్‌ను శ్రీను కులం పేరుతో దూషించిన‌ట్లు ఉండ‌డంతో జ‌గ‌న్ తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు.. శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.

Next Story