'నేను చనిపోతున్నా' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. చివరికి ఏమైందంటే..?
Man suicide attempt in Railway Koduru.ఆ దంపతులిద్దరూ మధ్య గొడవలు, నేను చనిపోతున్నా అంటూ ఆ భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడికి వెతికి పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
By తోట వంశీ కుమార్ Published on 20 April 2021 9:23 AM ISTఆ దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అయితే.. కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. భర్త, అతడి కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పలుమార్లు పంచాయతీలు చేసినా.. కాపురం కుదటపడలేదు. ఈ క్రమంలో భార్య.. తన భర్త ఇంట్లోకి వెళ్లి విలువైన వస్తువులు, బంగారం తీసుకెళ్లింది. ఈ విషయమై భార్యను అడిగేందుకు వెళ్లాడు భర్త. అయితే.. అక్కడ ఏం జరిగిందో తెలీదు గానీ.. నేను చనిపోతున్నా అంటూ ఆ భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడికి వెతికి పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వేకోడూరు పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బుర్ర లింగేశ్వర యాదవ్(41) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అతడికి 11 సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఆమె కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే.. కొంత కాలం క్రితం నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రోజు రోజుకి గొడవలు ఎక్కువ అవుతుండడంతో.. భర్త, ఆయన కుటుంబ సభ్యులపై కోడూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు చేసినా వీరి కాపురం కుదటపడలేదు.
ఈ క్రమంలో భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఈ నెల 10న రైల్వే కోడూరులోని భర్త ఇంట్లోకి తన అనుచరులతో ప్రవేశించి విలువైన వస్తువులు, బంగారం తీసుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై భార్య తరుపు వారిని అడిగేందుకని లింగేశ్వర యాదవ్.. ఈ నెల 17 సాయంత్రం తిరుపతి కి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు గానీ.. సోమవారం ఉదయం నేను చనిపోతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అది చూసిన లింగేశ్వర యాదవ్ సోదరుడు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
అతడికి ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. చివరి సారిగా ఫోన్ నెల్లూరు జిల్లా రాపూరులో పని చేసినట్లు గుర్తించారు. వెంటనే అక్కడ అతడి బంధువులకు ఫోన్లు చేయడంతో పాటు.. లాడ్జీలలో ఏమైనా ఉన్నాడేమోనని తెలుసుకున్నారు. చివరికి ఓ లాడ్జిలో లింగేశ్వర యాదవ్ ఉన్నట్లు గుర్తించారు. అయితే.. అప్పటికే అతడు నిద్రమాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడని.. వెంటనే అతడి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరుపతికి తరలించారు. అతడు ప్రాణాలతో బయటపడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఊపిరిపీల్చుకున్నారు.