రాత్రంతా లేడీస్ టాయిలెట్లో దాక్కొని.. ప్రియురాలి కోసం సెల్‌ఫోన్ చోరీ
Man stolen expensive mobiles for his girlfriend at Bengaluru. రాత్రంతా లేడీస్ టాయిలెట్లో దాక్కొని.. ప్రియురాలి కోసం సెల్‌ఫోన్ చోరీ
By అంజి Published on 31 July 2022 11:05 AM ISTప్రియురాలికి సెల్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఓ యువకుడు ఏకంగా ఓ షోరూంకు కన్నం పెట్టాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. బెంగళూరులోని జేపీ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 20న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అబ్దుల్ మునాఫ్ అనే వ్యక్తి క్రోమ్ షోరూంకు వెళ్లాడు. ఆ తర్వాత షోరూం సిబ్బందితో ఫోన్ల గురించి ఆరా తీశాడు. తీరా షాపు మూసే సమయంలో లేడీస్ టాయిలెట్‌లోకి వెళ్లిదాక్కున్నాడు. షోరూం మూసిన తర్వాత ఆరు ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించాడు.
ఆ రోజు రాత్రంతా లేడీస్ వాష్‌రూమ్‌లోనే గడిపాడు. తెల్లవారి రోజు సిబ్బంది షోరూం తెరిచారు. అదే సమయంలో కస్టమర్‌గా నటిస్తూ.. గ్రౌండ్ లిఫ్ట్ ద్వారా దొంగ తప్పించుకున్నాడు. ఆ కాసేపటికే సెల్‌ఫోన్లు దొంగతనం అయిన విషయాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి రూ.5 లక్షల విలువ చేసే ఖరీదైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ప్రియురాలి కోసం సెల్‌ఫోన్లు చోరీ చేసినట్లు చెప్పడంతో.. పోలీసులు అవాక్కయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటీఎం లేఅవుట్‌లోని ఓ రెస్టారెంట్‌లో బీహార్‌లోని పూర్నియాకు చెందిన దొంగ అబ్దుల్ మునాఫ్ పనిచేస్తున్నాడు. అతనికి ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళూరుకు చెందిన ఒక అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆమెను ఖరీదైన బహుమతితో ఆకట్టుకోవాలని అనుకున్నాడు. ఎలక్ట్రానిక్ షోరూమ్‌ను సిబ్బంది మూసివేస్తున్నప్పుడు, వారు షోరూంలో ఒక దొంగను విడిచిపెట్టినట్లు వారికి తెలియదు. అయితే, నిందితుడు అబ్దుల్ మునాఫ్, దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లలో ఒకదాన్ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత పోలీసులు IMEI నంబర్‌తో ట్రాక్ చేశారు.
''షోరూమ్‌లో మొబైల్ ఫోన్‌లను ఎలా దొంగిలించాలో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, ప్లాన్ రూపొందించాడు.'' అని పోలీసులు తెలిపారు.