సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సిద్ధారెడ్డి భార్య కవిత, ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు తన భర్తను, పిల్లలను వదిలి వెళ్ళిపోయింది. దీంతో తన భార్య కోసం గాలిస్తున్న సిద్ధారెడ్డి, ఒక కానిస్టేబుల్ సహాయంతో జడ్చర్లలో ఆమె ఆచూకీని కనుగొన్నాడు. అక్కడ కవిత తన ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూసిన సిద్ధారెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. పోలీసుల జోక్యంతో వారిద్దరినీ, సిద్ధారెడ్డిని ఒకే కారులో జహీరాబాద్ వైపు తీసుకువస్తుండగా ఈ దారుణం జరిగింది.
కారు ప్రయాణంలో కానిస్టేబుల్ ముందు సీట్లో కూర్చోగా.. వెనుక సీట్లో సిద్ధారెడ్డి, కవిత, ఆమె ప్రియుడు కూర్చున్నారు. కారు జహీరాబాద్ సమీపిస్తుండగా, సిద్ధారెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో కవిత గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తనను, పిల్లలను వదిలేసి పరాయి వ్యక్తితో ఉంటోందన్న కోపంతోనే సిద్ధారెడ్డి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రక్షణలో ఉండగానే ఈ హత్య జరగడంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.