పెళ్లికి నిరాకరించిందని మెడికోను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మెడికోను వ్యక్తి దారుణంగా చంపాడు.

By Srikanth Gundamalla  Published on  5 Dec 2023 6:25 AM GMT
crime, sentenced life,  medico murder case,

పెళ్లికి నిరాకరించిందని మెడికోను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మెడికోను వ్యక్తి దారుణంగా చంపాడు. 2022 జరిగిన ఈ కేసులో గుంటూరు జిల్లా కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. కావాలనే హత్యకు పాల్పడటంతో అతనికి జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.6వేల జరిమానా కూడా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి పార్థసారధి సోమవారమే తీర్పును ఇచ్చారు.

అయితే.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతనికి 2020 నవంబర్‌లో సోషల్ మీడియా ద్వారా అవుటపల్లిలోని డెంటల్‌ మెడికల్‌ కలైజీకి చెందిన తపస్వి అనే యువతితో పరిచయం ఏర్పడింది. యువతి తల్లిదండ్రులు ముంబైలో ఉంటూ.. అక్కడే ప్రయివేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. తపస్వి ఒక్కతే హాస్టల్‌లో ఉంటూ బీడీఎస్‌ చదువుతోంది. కాగా.. జ్ఞానేశ్వర్‌, తపస్వి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమ వరకు వెళ్లింది.ఈ క్రమంలోనే 2021 మార్చిలో జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లి అక్కడే ఒక ప్రయివేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

అలా వీరిద్దరూ గన్నవరంలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడే కొంతకాలం కలిసి ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు తపస్వినిని జ్ఞానేశ్వర్‌ అనుమానించడం మొదలుపెట్టాడు. దాంతో.. విసిగిపోయిన యువతి తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి కాలేజ్‌కు వెళ్లసాగింది. జ్ఞానేశ్వర్‌ పలుమార్లు వెళ్లి తపస్విని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడు. దానికి ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్‌ యువతిని చంపుతానంటూ బెదిరించారు. భయపడిపోయిన యువతి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసింది. అప్పుడు స్పందించిన పోలీసులు జ్ఞానేశ్వర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత యువతిపై కోపం పెంచుకున్న జ్ఞానేశ్వర్‌ 2022లో డిసెంబర్‌ 5న కత్తి, సర్జికల్‌ బ్లేడులు తీసుకుని తపస్వి ఉంటోన్న నివాసం వద్దకు వెళ్లాడు. మరోసారి ఇద్దరి మధ్య పెళ్లి విషయంలోనే వాగ్వాదం జరిగింది. దాంతో.. యువతిపై జ్ఞానేశ్వర్‌ కత్తి, సర్జికల్‌ బ్లేడులతో ఇష్టానుసారంగా దాడి చేశాడు.

ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకునేందుకు జ్ఞానేశ్వర్ ప్రయత్నించాడు. పక్క గదిలో ఉన్న కొందరు ఇది చూసి వెంటనే కేకలు వేస్తూ స్థానికులకు చెప్పారు. వారు పోలీసులకు చెప్పడం, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. కాగా.. యువతి అప్పటికే చనిపోయింది. నిందితుడు జ్ఞానేశ్వర్‌ మాత్రం గాయాలతో చికిత్స పొంది కోలుకున్నాడు. తాజాగా ఇదే కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. జ్ఞానేశ్వర్‌ కావాలనే తపస్విని హత్య చేశాడని నిర్ధారించింది. ఈ మేరకు పోలీసులు ఆధారాలు కూడా సమర్పించడంతో.. నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

Next Story