కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఆలయంలో ఆత్మహత్య
Man 'sacrifices his life' after wish for DMK win in Tamil Nadu came true.రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ అంటే
By తోట వంశీ కుమార్
రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ అంటే అభిమానం చాలా మందిలో ఉంటుంది. తమ నాయకులే గెలవాలని, తమ పార్టీనే అధికారంలోకి రావాలని కోరుకునే వీరాభిమానులు ఎందరో ఉంటారు. కొందరు తాము కోరుకున్న పార్టీ అధికారంలోకి వస్తే.. దేవుళ్లకు మొక్కులు చెల్లించిన ఘటనలు మనం చూశాం. అయితే.. ఇక్కడ ఓ వ్యక్తి తాను కోరుకున్న పార్టీ అధికారంలోకి వస్తే.. తన ప్రాణాలు అర్పిస్తానని మొక్కు కున్నాడు. అతడు కోరుకున్నట్లుగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
తమిళనాడు.. ఈ రాష్ట్రంలో తమ అభిమాన నాయకులకు గుడిలు కట్టిన ఘటనలు మనం చూశాం. అభిమానించాలే గానీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. కరూర్ జిల్లా లాలాపేటలో ఉలగనాథన్(60) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన రవాణా శాఖ విశాంత్ర ఉద్యోగి. శుక్రవారం మణమంగలం పుదు కాళియమ్మన్ ఆలయంలోకి వెళ్లాడు. అక్కడ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడ ఉన్న భక్తులతో పాటు ఆలయ సిబ్బంది గమనించి వెంటనే మంటలు ఆర్పేందుకు యత్నించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్నిపరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉలగనాథన్ రాసిన సూసైట్ నోటును స్వాధీనం చేసుకున్నారు.
శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలిచి స్టాలిన్ సీఎం కావాలని, ఎమ్మెల్యే సెంథిల్‌బాలాజీ విజయం సాధించాలని మొక్కుకున్నాను. విళుపురం జిల్లా గ్రామ నిర్వాహక అధికారిగా పనిచేస్తున్న నా కుమారుడిని మంత్రి సెంథిల్‌బాలాజీ పరిధిలో నియమించాలి అదే నా చివరి ఆశ అంటూ సూసైడ్ నోటులో ఉలగనాథన్ రాశాడు.