Hyderabad: వ్యక్తి హత్యకు దారి తీసిన భూవివాదం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిన వేణు హత్య కేసుని పోలీసులు చేధించారు.
By Srikanth Gundamalla Published on 12 Sep 2023 3:15 PM GMTHyderabad: వ్యక్తి హత్యకు దారి తీసిన భూవివాదం
భూ వివాదాలు చివరకు హత్యలకు దారి తీస్తున్నాయి. బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలు కరువైపోయాయి. కేవలం ఆస్తి మాత్రమే ముఖ్యంగా భావిస్తున్నారు. భూవివాదం విషయంలో హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. రాజేంద్రనగర్‌లో వేణుగోపాల్ హత్య కూడా కేవలం ఆస్తి కోసమే జరిగింది. పోలీసులు ఈ కేసును చేధించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిన వేణు హత్య కేసుని పోలీసులు చేధించారు. గతంలో కొనుగోలు చేసిన పది ఎకరాల భూ వివాదంపై లక్ష్మణ్ కు, వేణుకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కొనుగోలు చేసిన పది ఎకరాల్లో వేణుకు వాటా ఇవ్వకుండా మొత్తం తానే తీసుకోవాలని లక్ష్మణ్ కు కన్నింగ్ బుద్ధి పుట్టింది. ఈ క్రమంలోనే వేణును హత్య చేయాలని నిర్ణయించుకు న్నాడు. లక్ష్మణ్ తన కొడుకు పవన్‌తో కలిసి పక్కా ప్రణాళిక రచించాడు. వేణును హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే తండ్రి కొడుకులిద్దరు కలిసి వేణు ను చంపేందుకు సురేష్, జగదీష్, సాయి కిరణ్‌కు సుపారీ ఇచ్చాడు. వేణును చంపేందుకు ఈ ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలతో పాటు ఒక ఫ్లాట్ కూడా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారమే నిందితులు ముందుగా వేణు కదలికలపై రెక్కి నిర్వహించారు. అయితే 9వ తేదీన సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో వేణు తన స్నేహితులను కలిసి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతున్న సమయంలో నిందితులు కారు లో అతన్ని వెంబడించి అదును కోసం చూశారు. అత్యంత వేగంగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వేణు ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోయాడు.
నిందితులు అక్కడి వెళ్లి ఒకరు వేణు చేతులను పట్టుకోగా... మరొకరు వేణు గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు ఈ కేసును ఛేదించారు. పవన్, సురేష్, లక్ష్మణ్ , జగదీష్, సాయికిరణ్ హత్యకు పాల్పడిన ఈ ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్న సమయంలో వేణుగోపాల్ భార్య, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. నిందితులను తక్షణమే ఊరి తీయాలని... లేదంటే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా మని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు.