దారుణం.. అత్తను పెళ్లాడేందుకు భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త!
తన మేనత్తను వివాహం చేసుకోవడానికి అడ్డుపడుతుందనే కోపంతో, ఒక వ్యక్తి తన భార్యను పిల్లల ముందే కత్తెరతో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
By - అంజి |
దారుణం.. అత్తను పెళ్లాడేందుకు భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త!
తన మేనత్తను వివాహం చేసుకోవడానికి అడ్డుపడుతుందనే కోపంతో, ఒక వ్యక్తి తన భార్యను పిల్లల ముందే కత్తెరతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోర కలికాలం ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో చోటుచేసుకుంది. మెడికల్ స్టోర్ నడుపుతున్న నఫీస్ అనే వ్యక్తి, తన భార్య నజ్మా (ఆశా కార్యకర్త)ను విడాకులు ఇవ్వాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. నఫీస్ తన సొంత మేనత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలుసుకున్న నజ్మా, తన నలుగురు పిల్లలతో కలిసి గత కొంతకాలంగా విడిగా ఉంటోంది.
తన మేనత్తను పెళ్లి చేసుకోవడానికి విడాకులు ఇవ్వాలని నఫీస్ ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. ఆదివారం రాత్రి నజ్మా ఉంటున్న అద్దె నివాసానికి వెళ్లిన నఫీస్, ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఆవేశంలో తన వెంట తెచ్చుకున్న కత్తెరతో పిల్లల ముందే ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపాడు. భార్యను చంపిన అనంతరం, అదే కత్తెరతో నఫీస్ తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన నఫీస్‌ను ఆసుపత్రికి తరలించారు.
వీరిద్దరికీ 15 ఏళ్ల క్రితం వివాహం జరగగా, గత రెండేళ్లుగా నఫీస్ అక్రమ సంబంధం కారణంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు ఉపయోగించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. నఫీస్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు ధృవీకరించారు. ఈ కేసులో నిందితుడి మేనత్త పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతురాలి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయిందని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.