తండ్రిని గొడ్డలితో నరికి చంపి.. బిర్యానీ తిని పడుకున్నాడు: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం!

ఛత్తీస్‌గఢ్‌లో హోలికా దహన్ పర్వదినం వేళ అత్యంత కిరాతకమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి మందలించాడన్న కోపంతో...

By -  అంజి
Published on : 4 March 2026 7:13 AM IST

Chhattisgarh Murder, Father killed by son, Ambikapur crime news, Holika Dahan murder, Man eats biryani after killing father, Manipur Police Station Ambikapur

తండ్రిని గొడ్డలితో నరికి చంపి.. బిర్యానీ తిని పడుకున్నాడు: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం!

ఛత్తీస్‌గఢ్‌లో హోలికా దహన్ పర్వదినం వేళ అత్యంత కిరాతకమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి మందలించాడన్న కోపంతో, కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపి.. ఆపై ఏమీ తెలియనట్లు బిర్యానీ తిని ప్రశాంతంగా నిద్రపోయాడు ఓ ప్రబుద్ధుడు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుడు పరాస్ కెర్కెట్టా (50) తన సొంత ఇంట్లో నివసిస్తుండగా, అతని కుమారుడు ప్రభాత్ కెర్కెట్టా అలియాస్ 'లేడా' కొద్ది దూరంలోనే వేరే ఇంట్లో ఉంటున్నాడు.

హోలికా దహన్ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ప్రభాత్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తన కొడుకు ప్రవర్తనను చూసి తండ్రి పరాస్ తీవ్రంగా మందలించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన ప్రభాత్, ఇంట్లోనే ఉన్న ఒక గొడ్డలిని తీసుకుని తండ్రి తల మీద పదేపదే బలంగా నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పరాస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య చేసిన తర్వాత ప్రభాత్ ఏమాత్రం భయం లేకుండా వ్యవహరించాడు.

తండ్రి శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఇంటి పక్కనే ఉన్న చిన్న నీళ్ల ట్యాంకులో పడేశాడు. ఆ తర్వాత నేరుగా సమీపంలోని ఒక హోటల్‌కు వెళ్లి కడుపు నిండా బిర్యానీ తిన్నాడు. ఇంటికి తిరిగి వచ్చి, దుప్పటి కప్పుకుని ఏమీ ఎరగనట్లు ప్రశాంతంగా నిద్రపోయాడు. సమాచారం అందుకున్న మణిపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కోపంతోనే ఈ హత్య చేశానని ప్రభాత్ అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story