దారుణం: కుటుంబం మొత్తాన్ని హత్య చేసి.. వ్యక్తి సూసైడ్
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 5:37 PM ISTదారుణం: కుటుంబం మొత్తాన్ని హత్య చేసి.. వ్యక్తి సూసైడ్
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తరచూ కుటుంబ సభ్యులతో గొడవపెట్టుకున్నాడు. మద్యం సేవించి ఇబ్బందులు పడి.. తమనూ ఇబ్బంది పెట్టొద్దని ఎంత మొరపెట్టుకున్నా అతను వినలేదు. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి. ఈ సందర్భంలోనే అతన్ని మద్యం బానిస నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తల్లి, అతని భార్య ప్రయత్నించారు. కానీ.. అతను మాత్రం మద్యాన్ని వీడలేదు. చివరకు తల్లి, తన భార్యతో పాటు ముగ్గురు పిల్లలను దారుణంగా హతమార్చాడు.
ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్‌లోని పల్హాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. అనురాగ్ సింగ్ (42) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. అతనే కుటుంబాన్ని పోషించాల్సి ఉంది. కానీ.. సంపాదించిన డబ్బు మొత్తం తాగుడుకే పెట్టడంతో భార్య తరచూ గొడవపెట్టుకునేది. అయితే అనురాగ్‌కు భార్య ప్రియాంక (40), ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని తల్లి కూడా వీరితో పాటే ఉంటోంది. భార్యతో పాటు తాగుడు తగ్గించుకోవాలని తల్లి కూడా చెప్పింది. కానీ అతను మాత్రం వినలేదు. చివరకు డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దానికి కూడా అతను గొడపడేవాడు. తాను బాగానే ఉన్నానంటూ ఘర్షణకు దిగేవాడు.
తాజాగా మరోసారి అనురాగ్ సింగ్ మద్యం తాగేసి వచ్చాడు. దాంతో.. ఎలాగైనా అతడిని డి-అడిక్షన్ సెంటర్లో చేర్చాలని తల్లి, భార్య భావించారు. ఈసారి కొంచెం గట్టిగానే చెప్పారు. దాంతో అతను మరోసారి తల్లి, భార్యతో ఘర్షణకు దిగాడు. వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనురాగ్.. తల్లిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత భార్య ప్రియాంకను సుత్తితో కొట్టి కిరాతంగా హత్య చేశాడు. అక్కడే ఉన్న ముగ్గురు పిల్లలు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. వారిని ఇంటిపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోశేశాడు. దాంతో.. ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని అనురాగ్ సూసైడ్ చేసుకున్నాడు.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం సంచలనంగా మారింది. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని చెప్పారు. విచారణ చేస్తున్నామనీ.. త్వరలోనే ఇతర విషయాలను చెబుతామని పోలీసులు వెల్లడించారు.