మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. సుమారు 900 గ్రాముల బంగారాన్ని సీఐఎస్‌ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.42 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. నిందితుడి శరీరంలో జిగురు ముద్దలుగా ఉన్న నాలుగు ప్యాకెట్లలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా.. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ అనే ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనబడడంతో అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం అతడి శరీరం మొత్తాన్ని ఎక్స్‌రే తీశారు. ఈ ఎక్స్‌రేలో.. అతడి మలరంధ్రంలో నాలుగు బంగారు ప్యాకెట్లను దాచుకున్నట్లు గుర్తించారు. ఆ ప్యాకెట్లలో ఉన్న సుమారు 909.68 గ్రాముల బరువు గల బంగారం పేస్ట్‌ను సీఐఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. కాగా ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. ప్రాథమిక విచారణ చేపట్టారు. కాగా మణిపూర్ సరిహద్దు పట్టణం మోరే ద్వారా మయన్మార్ నుండి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.