కుమ్రం భీమ్ ఆసిఫాబాద్: మూడేళ్ల క్రితం నిషేధిత గంజాయి చెట్లను పెంచిన వ్యక్తికి ఆసిఫాబాద్ కోర్టు మంగళవారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. నిషేధిత 50 చెట్లను పత్తి పంటలో అంతర పంటగా పండించినందుకు ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన చునార్కర్ ముకుందరావుకు జైలు శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎంవీ రమేష్ తీర్పు వెలువరించారు.
2021 అక్టోబర్ 11న పోలీసులు పక్కా సమాచారంతో పొలంలో తనిఖీలు చేసినప్పుడు గంజాయి చెట్లను ముకుందరావు పెంచుతున్నట్టు తేలింది. పొలంలో సుమారు 50 గంజాయి చెట్లు లభ్యం అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ముకుందరావుకు జైలు శిక్ష పడింది. ఈ కేసులో కీలకంగా వ్యవహారించిన ఆసిఫాబాద్ డీఎస్పీ పి.సదయ్య, ఆసిఫాబాద్ ఇన్‌స్పెక్టర్ జి. సతీష్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఆర్.నారాయణలను పోలీస్ సూపరింటెండెంట్ డివి శ్రీనివాసరావు అభినందించారు.