రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన నలుగురు కుమార్తెలను హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. అయితే స్థానికులు అతన్ని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారు పదేళ్లలోపు చిన్నారులే. ఈ దారుణ ఘటన బాడ్‌మేర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. పోశాలా గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌ భార్య ఇటీవల కరోనా సోకి మృతి చెందింది. పుర్ఖారామ్‌కు నలుగురు కుమార్తెలు. అయితే వారికి తల్లి అవసరాన్ని గుర్తించిన పుర్ఖారామ్‌.. మరదలు(భార్య చెల్లి)ను ఇచ్చి వివాహం చేయాలని అత్తమామలను కోరాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తన కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర)లకు విషం తాగించాడు. అనంతరం వారిని ఇంటి బయట ఉన్న 13 అడుగుల లోతు గల నీటి సంపులో తోసేశాడు. అనంతరం అతడు అదే సంపులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అతడు సంపులో దూకడాన్ని గమనించిన స్థానికులు.. అతన్ని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పుర్ఖారామ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.

అంజి

Next Story