ఏలూరు జిల్లాలో దారుణం.. తమ్ముడిని చంపేసిన అన్న.. 30 గంటలు శవంతోనే
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సొంత అన్నను హత్య చేశాడు.
By అంజి Published on 7 March 2023 1:24 PM ISTతమ్ముడిని చంపేసిన అన్న (ప్రతీకాత్మకచిత్రం)
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సొంత అన్నను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరం గొల్లలదిబ్బలో నివాసం ఉంటున్న నరసింహరాజు, కృష్ణంరాజు అన్నదమ్ములు. నరసింహరాజు భార్య గతంలో చనిపోగా పిల్లలు లేరు. కాగా ఆయన సోదరుడు కృష్ణంరాజు భార్య కూడా కొన్ని రోజుల కిందట చనిపోయింది. ఆ తర్వాత కృష్ణంరాజు కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. దీంతో అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నరసింహరాజు ఇటీవల మధుమేహంతో బాధపడుతూ కాలి బొటనవేలు కోసుకున్నాడు. అప్పటి నుంచి కృష్ణంరాజు తన సోదరుడిని ఎగతాళి చేస్తున్నాడు. తన అన్నపై సానుభూతి చూపకుండా హేళన చేశాడు.
కాళ్లూచేతులు లాగుతున్నాయని ఏడుస్తుండడంతో.. ‘ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటి నుంచి వెళ్లిపో’ అని అన్నపై తమ్ముడు కేకలు వేశాడు. దీన్ని తట్టుకోలేని నరసింహరాజు కృష్ణంరాజు తలపై కొట్టి హత్య చేశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఆదివారం నరసింహరాజు ఇంట్లోనే ఉన్నాడు. అదేరోజు రాత్రి నిద్రపోయాక సోమవారం ఉదయం గణపవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన సోదరుడి హత్యను నరసింహరాజు పోలీసు సిబ్బందికి వివరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కృష్ణంరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నరసింహరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.