పోలీసునంటూ బెదిరించి.. ఇద్దరు బాలికలపై అఘాయిత్యం
Man assaulted two tribal minor girls in Vizianagaram district.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై
By తోట వంశీ కుమార్ Published on 2 Jan 2022 12:12 PM IST
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుని తిరిగి ఇంటికి వెలుతున్న ఇద్దరు విద్యార్థులను అడ్డగించిన ఓ రౌడీ షీటర్.. పోలీసునంటూ వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. శనివారం(జనవరి 1) మధ్యాహ్నాం ఇద్దరు విద్యార్థినులు, మరో ఇద్దరు విద్యార్థులు మొత్తం నలుగురు కలిసి ఒట్టిగెడ్డ రిజర్వాయర్ కు విహారయాత్రకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వస్తుండగా.. రౌడీ షీటర్ రాంబాబు వారిని అడ్డగించాడు. తాను పోలీసునంటూ.. చెప్పేది వినకుంటే అరెస్ట్ చేస్తానంటూ వారిని భయబాంత్రులకు గురిచేశాడు.
ఇద్దరు విద్యార్థులను అక్కడే కూర్చోబెట్టి.. విద్యార్థినులను ఇద్దరిని సమీపంలోని ఫామ్ ఆయిల్ తోటల్లోకి తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారిని విడిచిపెట్టారు. ఇంటికి చేరుకున్న అనంతరం జరిగిన విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడు రౌడీషీటర్ రాంబాబుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రాంబాబు గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న రాంబాబును కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.