విద్యార్థినులకు పోర్న్ వీడియో చూపించి అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడి అరెస్ట్
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటీవల తరచూ వరుస సంఘటను జరుగుతున్నాయి
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 8:45 AM ISTవిద్యార్థినులకు పోర్న్ వీడియో చూపించి అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడి అరెస్ట్
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటీవల తరచూ వరుస సంఘటను జరుగుతున్నాయి. ఆర్జీ కర్ ఆస్పతి సంఘటన తర్వాత వరుసగా లైంగిక వేధింపుల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపించాడు. ఆ తర్వాత అనుచితంగా ప్రవర్తించాడు. దాంతో.. విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. వారిలో ఒక విద్యార్థిని నేరుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కంప్లైంట్ చేసింది. దాంతో.. నిందితుడైన ఉపాధ్యాయుడిని అకోలా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే మహారాష్ట్ర బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై క్లీనింగ్ సిబ్బంది వాష్‌రూమల్ వద్ద లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ నిరసనలు కొనసాగున్న వేళనే మరోటి వెలుగులోకి రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో బాలికలకు అశ్లీల కంటెంట్‌ను చూపించాడు. ఆ క్రమంలో వారిని అనుచితంగా తాకినట్లు విద్యార్థినులు ఆరోపించారు. దాంతో.. 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు తర్వాత, అకోలాలోని కాజిఖేడ్ ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. విద్యార్థినుల్లో ఒకరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం, గత నాలుగు నెలలుగా ఉపాధ్యాయుడు తమకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆరుగురు బాలికలు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనల్లో విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం కూడా పాఠశాలను సందర్శించి కొంతమంది బాలికలతో మాట్లాడి కేసు నమోదు చేశారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆశా మిర్గే డిమాండ్ చేశారు.