మహారాష్ట్రలో బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ కారు
మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం సంభవించింది. కారు బ్రిడ్జి పైనుంచి రైల్వే పట్టాలపై పడిపోయింది.
By Srikanth Gundamalla Published on 2 July 2023 7:02 AM GMTమహారాష్ట్రలో బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ కారు
మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం సంభవించింది. నాగ్‌పూర్-ఇంగన్‌ఘాట్ మార్గంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై వెళ్తున్న కారు అదుపుతప్పింది. దీంతో.. బ్రిడ్జి రేలింగ్‌ను ఢీకొట్టి కింద ఉన్న రైల్వే పట్టాలపై పడిపోయింది. బోర్‌ఖేడి సమీపంలోని 796/16 పాయింట్ వద్ద ఈ రోడ్డుప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు ట్రాక్‌లు ఉండగా.. 3, 4 ట్రాక్‌ల మధ్య కారు పడిపోయింది. ఈ ఘటన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వారికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ వెంటనే రైల్వే సిబ్బంది, స్థానికులు స్పందించి... కారులో ఉన్నవారిని బయటకు తీశారు. ఆ తర్వాత క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
కాగా.. ప్రమాదానికి గురైన కారు తెలంగాణ నెంబర్ ప్లేట్‌తో ఉంది. నెంబర్ ప్లేట్ ఆధారంగా హైదరాబాద్ వెహికల్‌గా పోలీసులు గుర్తించారు. కారు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారు కూడా తెలుగు వారే అయి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇక రైల్వే ట్రాక్‌పైనే కారు పడిపోవడంతో ఆయా రూట్లలో వెళ్లే రైళ్లను అధికారులు నిలిపివేశారు. కారును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాక్ ఏమైనా దెబ్బతిని ఉంటే.. పునరుద్ధరిస్తారు. ఆ తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగించనున్నారు.