పరీక్షకు వెళ్తుండగా దారుణం.. అక్క, తమ్ముడిని కొట్టి చంపిన బాబాయ్!
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో శుక్రవారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు...
By - అంజి |
పరీక్షకు వెళ్తుండగా దారుణం.. అక్క, తమ్ముడిని కొట్టి చంపిన బాబాయ్!
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో శుక్రవారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను, భూ వివాదం కారణంగా వారి సొంత బాబాయ్, అతని కొడుకు కలిసి కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని సిద్దిక్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్‌పురి గ్రామంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. మృతులను శీతల్ మాలవీయ (20), ఆమె తమ్ముడు కుల్దీప్ మాలవీయ (19)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా, మార్గమధ్యలో బాబాయ్ హరిసింగ్ మాలవీయ, అతని కుమారుడు వారిని అడ్డుకున్నారు. నిందితులు ఇద్దరూ కలిసి అక్క, తమ్ముడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శీతల్, కుల్దీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి కుటుంబంలోని సుదీర్ఘ భూ వివాదమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
నిందితుడు హరిసింగ్ మాలవీయ, మృతుల తండ్రి జగదీష్ మాలవీయ స్వయానా అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న హరిసింగ్, తన కొడుకుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఎస్పీ దీపక్ శుక్లా ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.