మధ్యప్రదేశ్‌లో దారుణం, 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా మైహర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 11:05 AM ISTమధ్యప్రదేశ్‌లో దారుణం, 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజూ ఏదోచోట మహిళలు, యువతులు, బాలికలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొందరు మానవ మృగాలు వావివరుసలు, వయసు తారతమ్యాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో బాలిక దీనస్థిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా మైహర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్కండికి చెందిన 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దాంతో.. తల్లిదండ్రులు ఆమె కోసం చాలా వెతికారు. ఎంతకీ కనిపించకపోవడంతో భయపడిపోయి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పేరెంట్స్ కంప్లైంట్‌తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. శుక్రవారం ఉదయం మైహర్ దగ్గర అడవుల్లో ఉన్న శారదాదేవి ఆలయం దగ్గర బాలిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు స్థానికులు. వెంటనే పోలీసులకు చెప్పడంతో.. అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం బాలికను గుర్తించి వారికి సమాచారం అందించారు.
అయితే.. ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు అక్కడే నగ్నంగా రక్తపు మడుగులో పడిఉన్న బాలికను గమనించడంతో ఘటన వెలుగు చూసింది. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితిని పరీక్షించిన వైద్యులు బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ప్రస్తుతం బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉందని వెల్లడించారు. అంతేకాక ఒంటి నిండా పంటిగాయాలు ఉన్నాయని.. పదునైన ఆయుధాలతో ఆమె అంతర్గత అవయవాలనూ గాయపరిచారని నివేదికలో తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిపై దారుణంగా ప్రవర్తించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చేరుకుని నిందితులను పట్టుకోవాలని, ఉరితీయాలని.. బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దాంతో.. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత విచారణ చేసిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మైనర్‌పై అత్యాచారం ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ ప్రభుత్వం అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట వేడయంలో విఫలమవుతోందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే కారణమంటూ ఆరోపిస్తున్నారు.
ఇక ఈ దారుణమైన సంఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. బాలికకు జరిగిన అన్యాయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యున్నతస్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని.. కఠినంగా శిక్షించాలని అన్నారు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.