Madanapalle Crime: బాలికపై హత్యచారం.. చెరువులో నిందితుడి శవం లభ్యం

మదనపల్లెను వణికించిన చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ (30) మరణించాడు.

By -  అంజి
Published on : 18 Feb 2026 10:37 AM IST

Madanapalle minor girl murder, Accused Kulavardhan dead, Annamayya district crime news, Kanasanivaripalli pond body found, Girl body found in drum

Madanapalle Crime: బాలికపై హత్యచారం.. చెరువులో నిందితుడి శవం లభ్యం

మదనపల్లెను వణికించిన చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ (30) మరణించాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో బుధవారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లెకు చెందిన ఏడేళ్ల బాలిక సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది. సాయంత్రం పని ముగించుకుని తల్లి ఫోన్ చేయగా.. చిన్నారి కనిపించడం లేదని తాత చెప్పడంతో ఆందోళన మొదలైంది.

ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు గాలింపు చేపట్టగా, బాలిక చివరగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్‌తో కలిసి కనిపించిందని ఆమె తాత సమాచారం ఇచ్చారు. కులవర్ధన్ గతంలోనూ నేర చరిత్ర కలిగిన వ్యక్తి కావడంతో పోలీసులు అతనిపై దృష్టి సారించారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు అతని ఇంటికి వెళ్లి తలుపు తట్టినా స్పందన లేదు. మంగళవారం ఉదయం అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లోని ఓ డ్రమ్ములో చిన్నారి మృతదేహం విగతజీవిగా పడి ఉండటం చూసి పోలీసులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్న నిందితుడు కులవర్ధన్ కోసం అధికారులు గాలిస్తుండగానే, బుధవారం ఉదయం చెరువులో అతని శవం కనిపించింది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్ ఎలా చనిపోయాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రజల ఆగ్రహానికి గురై మరణించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అతని మరణానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Next Story