ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు.. సీసీ కెమెరాలో రికార్డ్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగుచూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని, కన్నతల్లి లాంటి అత్తను ఓ కోడలు ప్రియుడితో కలిసి...
By - అంజి |
ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు.. సీసీ కెమెరాలో రికార్డ్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగుచూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని, కన్నతల్లి లాంటి అత్తను ఓ కోడలు ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. దొంగతనం జరిగినట్లు నాటకమాడి తప్పించుకోవాలని చూసినా, పోలీసుల చాకచక్యం ముందు ఆ నిందితురాలి ఆటలు సాగలేదు. లక్నోకు చెందిన రంజనా వర్మ (36) అనే మహిళ, తన ఇంట్లోనే మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న రాజన్ శర్మ (21) అనే యువకుడితో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అత్తగారైన నిర్మలా దేవి (69)కి తెలియడంతో ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. అత్త అడ్డు తొలగించుకుంటేనే తాము స్వేచ్ఛగా ఉండగలమని భావించిన రంజన, ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. శనివారం మధ్యాహ్నం రంజన భర్త ఆఫీసుకి, కుమారుడు డెలివరీ పని మీద బయటకు వెళ్లారు. ఇంట్లో అత్త, రంజన మరియు ఆమె చిన్నారి మాత్రమే ఉన్న సమయంలో.. రంజన ముందుగా ఇంట్లోని సిసిటివీ కెమెరాలను ఆపేసింది. అనంతరం ప్రియుడు రాజన్ సహాయంతో అత్తగారి కాళ్లు, చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్లిపోయారు.
మృతురాలి మనవడు ఇంటికి వచ్చి చూసేసరికి నానమ్మ శవమై పడి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంజన వెంటనే ఇంటికి చేరుకుని దొంగలు వచ్చి చంపేశారంటూ ఏడుస్తూ నాటకమాడింది. అయితే పోలీసులు సిసిటివీ ఫుటేజీని పరిశీలించగా, హత్య జరిగిన మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మధ్య కెమెరాలు కావాలనే ఆపివేసినట్లు గుర్తించారు. అలాగే బయట ఉన్న కెమెరాలో రంజన, రాజన్ కలిసి బయటకు వెళ్లడం రికార్డయ్యింది.
అంతేకాకుండా, రంగంలోకి దిగిన పోలీస్ డాగ్ (స్నిఫర్ డాగ్) నేరుగా వెళ్లి పైన ఉంటున్న రాజన్ శర్మను పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.