గురుగ్రామ్ లోని మద్యం దుకాణంలో కోట్ల రూపాయల విలువైన మద్యం తగలబడిపోయింది. సెక్టార్ 55లోని ఓ మద్యం దుకాణంలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో దుకాణం మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలోని సెక్టార్ 55లోని వైన్ షాపులో మంటలు చెలరేగినట్లు ఉదయం 6:30 గంటలకు సమాచారం అందింది. ఆరు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. గంటన్నర శ్రమ తర్వాత మంటలను అదుపులోకి తెచ్చామని సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఇద్దరు ఫైర్ సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల రూ. 5 కోట్ల రూపాయాల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. ఎన్నో బ్రాండ్స్ కు చెందిన మద్యం మంటల్లో తగలబడిపోయిందని వాపోయారు.
మంటల ధాటికి బాటిళ్లు పేలడం వల్ల వారికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే షాపులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. "ఆ సమయంలో మద్యం షాపు మూసి ఉండడంతో అక్కడ సేల్స్‌మెన్ లేడు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నాము. అగ్నిప్రమాదంలో కోట్లాది నష్టం వాటిల్లింది" అని రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అగ్నిమాపక సిబ్బంది జస్బీర్ తెలిపారు.