కోర్టు నుంచి పరారైన హత్యాచారం నిందితుడు.. కొట్టి చంపిన స్థానికులు

Locals who were beaten to death by the murder suspect who escaped from the court. అసోంలోని లఖింపూర్‌ జిల్లాలో అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం కోర్టులో విచారణ

By అంజి  Published on  18 Aug 2022 6:02 PM IST
కోర్టు నుంచి పరారైన హత్యాచారం నిందితుడు.. కొట్టి చంపిన స్థానికులు

అసోంలోని లఖింపూర్‌ జిల్లాలో అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం కోర్టులో విచారణ జరుగుతుండగా తప్పించుకున్నాడు. అయితే అతడి ఆచూకీ కనిపెట్టిన స్థానికులు.. అతడి కొట్టి చంపారు. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందట గెర్జాయ్‌ బారువా అలియాస్‌ రాజు బారువా కోర్టు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఘిలామార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలకిలి గ్రామంలోని ఒక వాగు దగ్గర దాక్కుని ఉండగా, తెల్లవారుజామున కొంతమంది స్థానికులు అతన్ని పట్టుకున్నారని పోలీసు అధికారి తెలిపారు.

వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు.. ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయానికి మరింత మంది గ్రామస్థులు గుమిగూడి నిందితుడు బారువాను కొట్టడం ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి.. వ్యక్తి తీవ్రంగా గాయపడి కనిపించాడు. కోపంతో ఉన్న స్థానికుల నుండి అతనిని రక్షించే ప్రయత్నంలో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. "మేం అతనిని ధాకుఖానా సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాము. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స కోసం ఉత్తర లఖింపూర్ పట్టణానికి పంపాం." అని చెప్పారు.

నిందితుడిపై గత 15 ఏళ్లలో దొంగతనం, దోపిడీ, హత్య, అత్యాచారం మరియు ఇతర నేరాలకు సంబంధించిన డజన్ల కొద్దీ కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. బారువాతో పాటు మరో ఇద్దరు నిందితులు మంగళవారం ఢాకుఖానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు టాయిలెట్ నుండి పారిపోయారు. వారిని మళ్లీ పట్టుకునేందుకు పోలీసులు వెతుకగా.. ఓ నిందితుడు పట్టుబడగా, మరొకరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బారువా మరణవార్త తెలిసిన వెంటనే, అతని మృతదేహాన్ని చూసేందుకు ఢకుఖానా సివిల్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. రద్దీని నియంత్రించేందుకు, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. జనవరి 22 న, అతను ఉత్తర లఖింపూర్‌లోని ఒక ఆసుపత్రిలోని కోవిడ్ -19 వార్డు నుండి చేతికి సంకెళ్ళతో తప్పించుకున్నాడు. కాని రెండు రోజుల తర్వాత తిరిగి అరెస్టు చేయబడ్డాడు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా గాయపడ్డాడు.

Next Story