లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

హైదరాబాద్‌లో ఓ యువకుడు లోన్‌ యాప్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 12:34 PM GMT
Loan App, harassment, Young boy, Suicide, Hyderabad,

లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

డబ్బులు అవసరం అయిన వారు బయట ఎవరూ అప్పులు ఇవ్వకపోవడం.. లేదంటే చిన్న అమౌంటే కదా అని లోన్‌ యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి రుణాలు తీసుకుని చాలా మంది వేధింపులకు గురయ్యారు. రికవరీ ఏజెంట్లు పెట్టే టార్చర్‌ తట్టుకోలేక కొందరు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేశారు. లోన్‌ యాప్స్‌లో రుణాలు తీసుకోవద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు. అయినా కొందరు వినిపించుకోకుండా లోన్లు తీసుకుని వేధింపులకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు లోన్‌ యాప్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్ కు చెందిన నరేష్ అనే యువకుడు సంవత్సరం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్నాడు. నరేష్‌ ఆర్థిక పరిస్థులు బాగోలేక బయట ఎవరూ అప్పులు ఇవ్వకపోవడంతో లోన్‌ యాప్స్‌ను ఆశ్రయించాడు. ఆన్‌లైన్లో పలుమార్లు రుణాలు తీసుకున్నాడు. హాస్టల్‌లో ఉంటూ పని చేసుకుంటున్నాడు నరేశ్. తీసుకున్న లోన్లు కట్టకపోవడంతో ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. తీసుకున్న రుణం చెల్లించాలని.. లేదంటే నీ గురించి చెడగా ప్రచారం చేస్తామంటూ వేధించారు. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో నరేశ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెడు ప్రచారం చేస్తే బ్యాడ్‌ అయిపోతానని అనుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టలేక.. క్యారెక్టర్‌ బ్యాడ్‌ చేస్తారనే భయంతో నరేశ్‌తాను ఉంటోన్న హాస్టల్‌లోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోన్ ఆప్ ద్వారా రుణం తీసుకున్న వారు భయపడకుండా పోలీసులను ఆశ్రయిం చాలని ఒకవైపు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా.. కొందరు వినకుండా లోన్‌యాప్‌ నిర్వాహకుల వలలో పడి అధిక వడ్డీలు చెల్లిస్తూ వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా నరేశ్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది.


Next Story