హైదరాబాద్‌లో దారుణం.. సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్‌రేప్‌

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

By -  అంజి
Published on : 5 April 2026 8:44 AM IST

Kukatpally Gang Rape Case, Deceptive Marriage Crime, Hyderabad Police Investigation, Malkajgiri Commissionerate, Collective Sexual Assault, Nawaz Nellore Accused, Women Safety Hyderabad, Forced Marriage and Abuse

హైదరాబాద్‌లో దారుణం.. సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్‌రేప్‌

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు (26) తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది మే నెలలో తన ఇంటి వద్ద ఉన్న దుకాణాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఒక వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చింది. దీనిని చూసి నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి ట్రేడింగ్ వ్యాపారం పేరుతో ఆ షాపును అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్న నవాజ్, ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తన మతాన్ని కూడా మార్చుకుంటానని నమ్మబలికాడు.

ఒకరోజు బేగంపేట్‌లోని తన సోదరుల ఇంటికి భోజనానికి పిలిచిన నవాజ్, జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత నవాజ్ తన సోదరులు, స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఒత్తిడి చేసి, గత ఏడాది జూన్ నెలలో కూకట్‌పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా భర్తతో పాటు అతని స్నేహితులు, సోదరులు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గత రెండు నెలల నుంచి భర్త కనిపించకుండా పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నేరం (సామూహిక అత్యాచారం) బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినందున, తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు బదిలీ చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ వెల్లడించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story