వీడిన దీప్తి హత్య కేసు మిస్టరీ.. చందన, ఆమె ప్రియుడే హంతకులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోరుట్లకు సాప్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది
By Medi Samrat
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోరుట్లకు సాప్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన అక్క దీప్తీని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ప్రెస్ మీట్ ద్వారా మీడియాకు వివరించారు. దీప్తి మృతి కేసును చేదించేందుకు 5 పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఆర్మూర్ బాల్కొండ రూట్‌లో వాహనంలో వెళుతుండగా కోరుట్ల పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు.
దీప్తిని చెల్లెలు చందన.. ఆమె లవర్ ఉమర్ షేక్ సుల్తాన్ కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు. రాత్రి 2 గంటలకు చందన తన లవర్ ఉమర్ షేక్ సుల్తాన్ తో కలిసి బంగారం దొంగతనం చేస్తుండగా అలికిడికి దీప్తి నిద్ర లేచి అరిచింది. అరవకుండా చున్నీతో చేతులు కట్టేసి మూతికి, ముక్కుకు ప్లాస్టర్ వేసి 1,25,000 రూపాయలు నగదు, 70 తులాల బంగారం ఎత్తుకెళ్లారని తెలిపారు. అయితే వారు వెళ్ళేటపుడు ప్లాస్టర్ తీసేసి వెళ్లారని.. అప్పటికే దీప్తీ మృతి చెందిన విషయం చందన, ఆమె లవర్ ఉమర్‌కు తెలియదని.. కావాలని చేసిన హత్య కాదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ రాత్రి ఇరువురు హైదరాబాద్ లో ఉమర్ ఇంటికి వెళ్లారని.. అక్కడి నుండి ముంబై పారిపోయేందుకు ప్లాన్ వేశారని.. ఈ క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డారని వివరించారు. నిందితుల వద్ద నుంచి బంగారం, లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అభినందించారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు