లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండ‌గా.. కొరియ‌న్ మ‌హిళా యూట్యూబ‌ర్‌తో ముంబై యువ‌కుల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

Korean woman YouTuber harassed on Mumbai street during live stream.ముంబైలోని ఓ వీధిలో ద‌క్షిణ కొరియా యూట్యూబ‌ర్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 12:25 PM IST
లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండ‌గా.. కొరియ‌న్ మ‌హిళా యూట్యూబ‌ర్‌తో ముంబై యువ‌కుల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

ముంబైలోని ఓ వీధిలో ద‌క్షిణ కొరియా మ‌హిళా యూట్యూబ‌ర్‌ను ఇద్ద‌రు యువ‌కులు వేధించారు. ఆమె లైవ్ స్ట్రీమ్ చేస్తుండ‌గా ఓ ఆక‌తాయి ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ద‌క్షిణ కొరియాకు చెందిన మ‌యోచి అనే యూట్యూబ‌ర్ మంగ‌ళ‌వారం రాత్రి ముంబైలోని ఓ వీధిలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కులు ఆమెను ఇబ్బంది పెట్టారు. లిఫ్ట్ ఇస్తామ‌ని చెప్పి బ‌ల‌వంతంగా చెయ్యి ప‌ట్టుకుని లాక్కెళ్ల‌బోయారు. ఆ యువ‌తికి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్లాల‌ని వాళ్ల‌ని వారిస్తూ వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. అంత‌లో ఓ యువ‌కుడు ఆమెని ముద్దుపెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. భ‌యాందోళ‌న చెందిన ఆ యూట్యూబ‌ర్ అక్క‌డి నుంచి చ‌కా చ‌కా ముందుకు న‌డ‌వ‌సాగింది. అయిన‌ప్ప‌టికీ ఆ యువ‌కులు వ‌ద‌ల‌లేదు. ఆమెను అనుస‌రించ‌సాగారు. బైక్‌ను ఎక్కాలంటూ బ‌ల‌వంతం చేశారు. ఇందుకు ఆ యువ‌తి నిరాక‌రించింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఆదిత్య అనే నెటీజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ యువ‌తిని వేధించిన వారిపై చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని ముంబై పోలీసుల‌ను కోరాడు. ఇలాంటి వారిని వ‌దిలిపెట్ట‌వ‌ద్ద‌న్నాడు. ముంబై పోలీసుల‌ను ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు.

అక్క‌డ ఉన్న ఓ యువ‌కుడు నన్ను వేధించాడు. వెంట‌నే అక్క‌డి నుంచి వ‌చ్చేశాను. ఎందుకంటే వారు ఇద్ద‌రు ఉన్నారు. నేను వారితో ఫ్రెండ్లీగా మాట్లాడ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక‌పై ఈ ఘ‌ట‌న‌తో నేను వీధుల్లో స్ట్రీమింగ్ చేయాలంటే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాలేమో అంటూ ఆ ట్వీట్‌ను య‌మోచి రీ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ల‌పై ముంబై పోలీసులు స్పందించారు. మీరు చెప్పిన దానిని ప‌రిశీలిస్తున్నాం. మీరు నేరుగా మాకు మెయిల్ పంపించండి అని ట్వీట్ చేయ‌గా.. మీకు ఎలా స‌మాచారం అందించాలో నాకు తెలియ‌దు. మీరు తొలుత సందేశం పంపండి. దాని ఆధారంగా మీకు అవ‌స‌ర‌మైన మొత్తం స‌మాచారం ఇస్తానంటూ య‌యోచి ట్వీట్ చేసింది.

Next Story