మాంసం కోసం కిరాతకం
Killing Buffalo for meat in Siddipet district.మాంసం కోసం పాడిగేదెలను ట్రాక్టర్‌తో ఢీకొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 7:47 AM ISTమాంసం కోసం పాడిగేదెలను ట్రాక్టర్‌తో ఢీకొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ఆపై వాటి శరీర భాగాలను కోసుకుని ఎత్తుకెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేశం అనే రైతు తన రెండు పాడి గేదెలను శుక్రవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు రెండు పాడి బర్రెలు చనిపోయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా హతాశుడయ్యాడు.
ట్రాక్టర్‌తో ఢీకొట్టి, కత్తులతో పొడిచి వాటిని చంపినట్టు, వాటి తొడ, తుంటి, పొదుగు భాగాలను కత్తులతో కోసి తీసుకెళ్లినట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి గుర్తించాడు. తోటి రైతులతో కలిసి వెంకటేశం సమీపంలో గాలించగా దమ్మక్కపల్లి గ్రామ శివారులోని రాజేందర్‌రెడ్డికి చెందిన మామిడి తోటలోని ఓ గదిలో బర్రె మాంసం లభ్యమైంది. దీంతో ఏం జరిగింది అనే విషయమై స్థానికులు ఆరా తీశారు. నేపాల్ దేశానికి చెందిన సందీప్ సునార్ మరో ముగ్గురితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. స్థానికులు సిద్దిపేట త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
వెంకటేశం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడితో పాటు మామిడితోట పర్యవేక్షకుడు దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మేకల మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులు ఉపయోగించిన ట్రాక్టర్, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.